: చంద్రబాబు తన హత్యా రాజకీయాలను ఎన్టీఆర్ తోనే ప్రారంభించారు: లక్ష్మీపార్వతి తీవ్ర ఆరోపణ
చంద్రబాబు.. ఎన్టీఆర్ తోనే హత్యా రాజకీయాలను ప్రారంభించారని, వంగవీటి రంగా హత్యలోనూ బాబు పాత్ర ఉందని, వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఆరోపించారు. గుంటూరులో వైఎస్సార్సీపీ ప్లీనరీలో ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పొట్టన పెట్టుకున్న ఘనుడు చంద్రబాబు అయితే, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి వైఎస్సార్ అని అన్నారు.
వంగవీటి రంగాను పొట్టన పెట్టుకున్న వాళ్లను నెత్తిన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపు ఉద్యమాన్ని అణచివేయాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, ఎదురుతిరిగిన వారిపై అక్రమకేసులు పెట్టి వేధిస్తున్నారని, ముద్రగడ పాదయాత్రకు అనుమతి కావాలని చంద్రబాబు అంటున్నారని, మరి, నాడు చంద్రబాబు చేసిన పాదయాత్రకు ఎవరి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు.
రాష్ట్రం చంద్రబాబు జాగీరు కాదని, ముద్రగడ యాత్రకు ఎవరి అనుమతి అవసరం లేదని అన్నారు. ముద్రగడ యాత్రకు అనుమతిస్తే సరేసరి, లేని పక్షంలో అందరం రోడ్డెక్కుతామని, దేనికైనా తెగిస్తామని ఆమె హెచ్చరించారు. చంద్రబాబు దుష్టపాలన అంతానికి అందరూ ముందుకు రావాలని, బాబును ఇంటికి పంపి, జగన్ ను సీఎం చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు.