: వైఎస్ జ్ఞాపకాలు చెరిగిపోలేదు.. అందరిగుండెల్లోను పదిలంగా ఉన్నాయి: వైఎస్ విజయమ్మ
వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లి పోయి ఎనిమిదేళ్లయినా ఆయన జ్ఞాపకాలు మాత్రం చెరిగిపోలేదని, అందరిగుండెల్లోను పదిలంగా ఉన్నాయని దివంగత రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ అన్నారు. గుంటూరులో జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో ఆమె మాట్లాడుతూ, ‘ఈ ప్లీనరికీ వచ్చిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వైఎస్ఆర్ ప్రేమ, ఆత్మీయత, మంచితనం అందరూ గుర్తుపెట్టుకున్నారు. నాడు వైఎస్ పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. సంక్షేమ, అభివృద్ధి పనులతో నూతన శకానికి వైఎస్సార్ నాంది పలికారు.
వైఎస్ చనిపోయినప్పుడు 150 మంది ఎమ్మెల్యేలు జగనే సీఎం కావాలని కోరుకున్నా, రోశయ్య సీఎం కావడానికి జగన్ సహకరించారు. కానీ, ఓదార్పు యాత్ర వద్దని, జగన్ కు సహకరించొద్దని కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్యేలకు చెప్పింది. కాంగ్రెస్ లో ఉన్నంతకాలం వైఎస్సార్, జగన్ మంచివారిగా కనిపించారు.. ఆయన మరణించాక కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టి జగన్ ను జైలుకు పంపించారు. తొంభై రోజుల్లో ఎవరికైనా బెయిల్ వస్తుంది. కానీ, నా బిడ్డను 16 నెలలు జైల్లో పెట్టారు. నా బిడ్డను మొదటి ప్లీనరీలో మీకు అప్పగించాను.. అప్పటి నుంచి ప్రతివిషయంలోనూ గట్టిగా పోరాడుతున్నాడు. అసెంబ్లీ లోపల, బయట తన వాణి వినిపిస్తున్నాడు. టీడీపీ నేతలు దూషిస్తున్నా ప్రజల కోసం అవన్నీ భరిస్తున్నాడు. వైఎస్ సంక్షేమ పథకాల అమలు కోసం నిరంతరం పోరాడుతున్నాడు. జగన్ కు మీరంతా అండగా ఉండాలి’ అని విజయమ్మ అన్నారు.