: గీతకు పెళ్లి... స్వయంగా కన్యాదానం చేయనున్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
ఇండియా నుంచి తప్పిపోయి, సుదీర్ఘ కాలం పాటు పాకిస్థాన్ లో ఉండి, ఆపై ఇండియాకు వచ్చిన గీతకు పెళ్లి కుదిరింది. తన తల్లిదండ్రులను గుర్తించడంలో గీత విఫలం కాగా, ఇప్పుడు ఆమె పెళ్లిని మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా చేయనున్నారు. ఆయనే కన్యాదానం చేస్తారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు.
తాను తరచూ గీతను కలుస్తూనే ఉన్నానని, ఆమె వివాహ విషయాన్ని చౌహాన్ చూసుకుంటారని అన్నారు. భోపాల్ కు వచ్చిన ఆమె, ఎంపీలు, ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ, రామ్ నాథ్ కోవింద్ గెలుపునకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సుష్మా స్వరాజ్ ను కలిసిన అనంతరం గీత మాట్లాడుతూ, తాను మరోసారి పాకిస్థాన్ కు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషలను నేర్చుకుంటున్న గీత, తాను భారతీయురాలినేనని, ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపింది.