: స్పైస్ జెట్ ఇంజన్ దెబ్బకు పక్కనే ఉన్న ఇండిగో అద్దాలు పగిలి ఐదుగురికి గాయాలు
రన్ వే నుంచి దిగి పార్కింగ్ బేలోకి వస్తున్న ఓ స్పైస్ జెట్ విమానం ఇంజన్ ధాటికి, పక్కనే టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న ఇండిగో విమానం అద్దాలు పగిలి ఐదుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన న్యూఢిల్లీ విమానాశ్రయంలో కలకలం రేపింది. పోలీసులు, విమానాశ్రయం అధికారులు ఘటనపై విచారణ జరుపుతూ ఉండగా, స్పైస్ జెట్ మాత్రం, ఇండిగో విమానం అద్దాలు పగిలిన కారణం ఇంకా తేలలేదని తెలిపింది.
తమ ఇంజన్ నుంచి వచ్చిన బ్లాస్ట్ కారణంగా అద్దాలు పగిలాయనడానికి ఆధారాలు లేవని, మరేదైనా కారణం ఉండి వుండవచ్చని పేర్కొంది. ఈ ఘటనతో ముంబైకి బయలుదేరాల్సిన ఇండిగో విమానం ఆలస్యమైంది. స్వల్పగాయాలైన ప్రయాణికులను వెంటనే ఎయిర్ పోర్టులోని క్లినిక్ కు తరలించి చికిత్స అందించామని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు తమ ప్రయాణాన్ని కొనసాగించారని తెలిపారు. పార్కింగ్ బేకు వస్తున్న జెట్ విమానం ఇంజన్ నుంచి ఒక్కసారిగా అధికమొత్తంలో గాలి వెలువడిన కారణంగానే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.