: విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ
రెండు దేశాల పర్యటనను విజయవంతంగా ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. జూలై 4న ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లిన ఆయన, అక్కడ మూడు రోజులుండి, ఆపై హాంబర్గ్ లో జరిగిన జీ-20 సమావేశాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ తో ఏడు ఒప్పందాలను, అక్కడి వ్యాపార సంస్థలతో 5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. స్టార్టప్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, భద్రత, వ్యవసాయం, ఇంధనం, జల వనరుల రంగాల్లో ఆరు సంయుక్త కమిటీలను ఇరు దేశాలూ నియమించాయి.
ఆపై జర్మనీకి వెళ్లిన ఆయన, జీ-20 దేశాలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని పిలుపునిస్తూనే, వలసలపై అగ్ర రాజ్యాల వైఖరిని ఎండగట్టారు. అమెరికా సహా పలు దేశాల అధినేతలను ఆయన కలుసుకున్నారు. ట్రంప్ తో పాటు వ్లాదిమిర్ పుతిన్, జిన్ పింగ్, షింజో అబే, జస్టిన్ ట్రుడావ్, థెరిస్సా మే తదితరులతోనూ చర్చలు జరిపారు. తన పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్న మోదీకి అధికారులు, బీజేపీ నేతలు స్వాగతం పలికారు.