: ఎవరూ హెలికాప్టర్లు ఎక్కవద్దు: మహారాష్ట్ర సర్కారు ఆదేశం
ఇటీవలి కాలంలో హెలికాప్టర్లు వరుసగా మొరాయిస్తూ, ఎమర్జెన్సీ ల్యాండింగులు అవుతుండగా, మహారాష్ట్ర సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ ముఖ్యమంత్రి సహా, ఇతర వీఐపీలు వేరే ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే హెలికాప్టర్లను వాడవద్దని తెలిపింది. ఈ మేరకు వీఐపీల చాపర్ ప్రయాణాలను రద్దు చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమిత్ ములి ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఇక సీఎం ఫడ్నవీస్ విమానాశ్రయాలున్న ప్రాంతాలకు ప్రభుత్వ విమానంలో వెళ్లి, అక్కడి నుంచి కార్లలోనే ప్రయాణం చేయాల్సి వుంటుంది. కాగా, మే 25న లాతూర్ జిల్లాలో ఫడ్నవీస్ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న చాపర్ అదుపుతప్పి క్రాష్ ల్యాండింగ్ అయింది. దీనిపై అధికారులు ఇంకా విచారణ జరుపుతున్నారు. గత వారంలోనూ ఫడ్నవీస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.