: విశాఖపట్నంలో దారుణం.. ప్రియురాలిని అతి దారుణంగా చంపేసిన ప్రియుడు!
మాట్లాడేందుకు తన ప్రియురాలిని ఇంటికి పిలిపించుకున్న ఓ యువకుడు రెండు గంటల తర్వాత ఆమెను అతి దారుణంగా హత్య చేసిన ఘటన విశాఖపట్నం, పూర్ణామార్కెట్ పరిధిలోని పండా వీధిలో చోటు చేసుకుంది. ఇంట్లోని కబ్బోర్డు అద్దం బద్దలుగొట్టి అద్దం ముక్కతో తన ప్రియురాలి గొంతుని కోశాడు. ఆ యువతి పెట్టిన అరుపులు విన్న స్థానికులు ఆ యువకుడిని ఆపడానికి ప్రయత్నించగా.. తన వద్దకు వస్తే వారిని కూడా చంపేస్తానని బెదిరించాడు. ఆ యువతి రంగిరీజు వీధిలో నివసిస్తున్న బూరలి భవాని అని పోలీసులు తెలిపారు. సతీష్‌కుమార్ అనే యువకుడితో ఆమెకు మూడేళ్లుగా పరిచయం ఉందని, ఒకరింటికి ఒకరు వెళుతుంటారని చెప్పారు.
భవానిని చంపిన తరువాత కూడా ఆగ్రహం తగ్గించుకోని ఆ యువకుడు ఆమె తలపై డంబెల్‌తో మోదాడు. అనంతరం మృతురాలి జుట్టు పట్టుకొని మెట్లపై నుంచి ఈడ్చుకుంటూ బయటకు వచ్చాడు. దీనిని గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని చితక్కొట్టి, పోలీసులకు సమాచారం అందించారు. గాయాలపాలైన నిందుతుడిని ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు ప్రారంభించారు.