: జగన్ అన్నని ఒక చెల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను!: ఎమ్మెల్యే రోజా
గుంటూరులో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న ప్లీనరీలో ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనపై నిప్పులు చెరిగారు. డ్వాక్రా మహిళలకు చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నారని ఆమె అన్నారు. మరోవైపు మద్యాన్ని యథేచ్ఛగా అమ్ముకునేలా చేస్తూ ఆడవారి జీవితాలని రోడ్డున పడేలా చేస్తున్నారని అన్నారు. బజారుకో బీరు షాపు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆడవారి కన్నీళ్లలో చంద్రబాబు నాయుడు కొట్టుకుపోతారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఓ అన్నగా భావించారని రోజా అన్నారు. సొంత అన్న ముఖ్యమంత్రి అయితే తన చెల్లెళ్లని ఎలా చూసుకుంటారో వైఎస్సార్ అలా చూసుకున్నారని వ్యాఖ్యానించారు. మహిళలకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగే అవకాశాలను ఇచ్చారని తెలిపారు. వారిని ముందుకు నడిపించారని అన్నారు.
తాను జగన్ అన్నని ఒక చెల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నానని, అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలపై మహిళలకు న్యాయం చేయాలని రోజా కోరారు. అలాగే మహిళల జీవితాలను రోడ్డున పడేస్తోన్న మద్యాన్ని అరికట్టేలా చేస్తానని ఓ ప్రకటన చేయాలని అన్నారు. డ్వాక్రా రుణాలు ఇస్తామంటూ మోసం చేసిన చంద్రబాబు నాయుడి మోసాలను తాము బయటపెడుతున్నామని రోజా అన్నారు. శ్మశానానికి ముగ్గు ఉండదు.. చంద్రబాబునాయుడికి సిగ్గు ఉండదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా చంద్రబాబు నాయుడు 85 బార్లకు లైసెన్సులు ఇచ్చారని ఆమె అన్నారు.
జగన్ అన్న చంద్రబాబు నాయుడి మోసాలను, కుట్రలను అరికట్టి మహిళలకు న్యాయం చేయాలని ఆమె కోరారు. డ్వాక్రా రుణాలపై వడ్డీ రూ.10 వేల కోట్లకు చేరిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా వ్యవస్థను చంద్రబాబు సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. పట్టపగలు కూడా మహిళలకు రక్షణ లేకుండాపోయిందని వ్యాఖ్యానించారు. మహిళలపై 11 శాతం క్రైమ్ రేట్ పెరిగిందని రాష్ట్ర డీజీపీనే చెప్పారని అన్నారు.