: ఉదయ్ కిరణ్ పెళ్లి రద్దు కావడానికి చిరంజీవి కారణం కాదు: ఉదయ్ అక్క
సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే వరుస హిట్లతో దూసుకుపోయాడు హీరో ఉదయ్ కిరణ్. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితతో పెళ్లి రద్దు, సినిమాల్లో ఫెయిల్యూర్లు ఉదయ్ ను డిప్రెషన్ కు గురి చేశాయి. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఆత్మహత్యకు చిరంజీవి కుటుంబమే కారణమనే విమర్శలు కూడా అప్పట్లో చెలరేగాయి.
ఈ నేపథ్యంలో, ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి మాట్లాడుతూ సుస్మితతో పెళ్లి రద్దు కావడానికి చిరంజీవి కానీ, ఆయన కుటుంబసభ్యులు కానీ కారణం కాదని చెప్పారు. చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే ఉదయ్ కు చాలా ఇష్టమని... ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఉదయ్ కు చిరంజీవి చాలా సహకారం అందించారని తెలిపారు. తన కుమార్తెను కూడా ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నారని... గ్రాండ్ గా నిశ్చితార్థం చేశారని చెప్పారు.
అయితే, నిశ్చితార్థం తర్వాత ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారని... ఇద్దరి ఆలోచనలు కలవడం లేదనే అభిప్రాయానికి వచ్చారని తెలిపారు. పెళ్లి రద్దు చేసుకుందామనే నిర్ణయాన్ని ఉదయ్ కిరణే తీసుకున్నాడని చెప్పారు. ఉదయ్ తో కలసి ఒకసారి చిరంజీవి ఇంటికి వెళ్లానని... ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం అద్భుతమని అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు.