: అతడి కడుపులో ఏకంగా 150 గుండుసూదులు... షాకైపోయిన వైద్యులు!
వైద్యం కోసం వచ్చిన ఓ వ్యక్తికి పలు పరీక్షలు నిర్వహించిన ఢిల్లీ డాక్టర్లు అతడి కడుపులో ఏకంగా 150 గుండుసూదులు ఉన్నాయని తెలుసుకుని షాక్ అయ్యారు. ఎంతో కష్టపడి సర్జరీలు చేసి, ఇప్పటివరకు 90కి పైగా గుండుసూదులను తొలగించిన వైద్యులు ఇంకా సుమారు 60 సూదులను తీయాల్సి ఉందని చెప్పారు. ఆయన శరీరంలోని ఆహార వాహిక, శ్వాసనాళంతో పాటు పలు భాగాల్లో మిగిలి ఉన్న ఈ గుండుసూదులు త్వరలోనే తొలగిస్తామని, బాధితుడి పరిస్థితి నిలకడగానే ఉందని అన్నారు.
సదరు బాధితుడి పేరు బద్రిలాల్ అని, ఆయన శరీరంలో గుండుసూదులు ఉన్నాయని ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియదని వైద్యులు చెప్పారు. అసలు ఆయన కడుపులోకి అన్ని సూదులు ఎలా వెళ్లాయో ఇంకా తెలియరాలేదని చెప్పారు. బద్రిలాల్ మూడు నెలల్లో 30 కిలోల బరువు తగ్గారని అన్నారు. ఆయనకు ఇటీవల కాలికి గాయం అయిందని, దీంతో తమను సంప్రదించారని తెలిపారు. మూడు నెలలుగా బద్రిలాల్‌కు కడపులో తీవ్రమైన నొప్పి వస్తోందని తెలియడంతో తమకు అనుమానం వచ్చి వైద్య పరీక్షలు చేయిస్తే ఆయన శరీరంలో గుండు సూదులు ఉన్నట్లు తేలిందని చెప్పారు.