: తనకు డిపాజిట్లు కూడా రావనే ఎన్టీఆర్ పేరును చంద్రబాబు వాడుకుంటున్నారు: రోజా


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఛరిష్మా లేదనే ఎన్టీఆర్ ఫోటోను వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ ప్లీనరీ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత మహానాడులో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవరూ కనిపించలేదని, దానిని బట్టే ఎన్టీఆర్ కుటుంబానికి ఆ పార్టీపై ఎంత పట్టు ఉందో అర్థమవుతుందని అన్నారు. గతంలో ఎన్టీఆర్ చిత్రపటాలను కూడా చంద్రబాబు తీయించేశారని ఆమె గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నాటి సిద్ధాంతాలేవీ ఆ పార్టీలో ఇప్పుడు లేవని ఆమె స్పష్టం చేశారు.

కేవలం ఎన్టీఆర్ పేరును ప్రచారం కోసం, ఎన్నికల్లో విజయం సాధించడం కోసం మాత్రమే వాడుకుంటున్నారని ఆమె తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ లా సొంతంగా పార్టీ పెట్టి, ప్రతిపక్షంలో కూర్చుని, అధికారంలో ఉన్న పార్టీతో సమర్థవంతంగా పోరాడితే, సత్తా తేలిపోతుందని ఆమె సవాల్ విసిరారు. ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్తే ఆయనకు ఎవరూ ఓటేయరన్న విషయం చంద్రబాబుకు తెలుసని ఆమె ఎద్దేవా చేశారు. జగన్ తన ఆస్తులను ప్రతి ఏటా ఎన్నికల సంఘానికి సమర్పిస్తారని, వాటిపై కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News