: వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు 10 మంది ఏసియాన్ దేశాల అధినేతలు
`యాక్ట్ ఈస్ట్` పాలసీలో భాగంగా జరుగుతున్న అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు 10 ఏసియాన్ దేశాలకు చెందిన అధినేతలను ఆహ్వానించాలని నిర్ణయించుకుంది. `అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్`ను సూక్ష్మరూపంలో ఏసియాన్ కూటమి అని పిలుస్తారు. ఈ కూటమిలో బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాలు ఉన్నాయి.
ఈ 10 దేశాల అధినేతలను ఆహ్వానిస్తే 2018 గణతంత్ర దినోత్సవ వేడుకలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. ఇక ఆయా దేశాల మిలటరీ విన్యాసాలతో అప్పుడు జరగబోయే పరేడ్ కూడా చరిత్రలో నిలిచిపోనుంది. చైనాతో పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి ఏసియాన్ దేశాలతో అవినాభావ సంబంధాలు పెంచుకోవడం మంచిదేనని కొంతమంది అభిప్రాయం. అలాగే ఈ కూటమిలోని వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై దేశాలకు కూడా దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనాతో విభేదాలు ఉన్నాయి.