: షారూఖ్ ఇచ్చిన కారులో సల్మాన్ షికార్లు.... సోషల్ మీడియాలో కారు వైరల్
బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఇటీవల విలాసవంతమైన ఓ కారును బహూకరించిన సంగతి తెలిసిందే. గతంలో కొంత కాలం ఎడమొహం పెడమొహంగా ఉన్న వీరిద్దరూ, మళ్లీ కలిసిన అనంతరం పాత రోజులను గుర్తు చేస్తూ అత్యంత సన్నిహితంగా గడుపుతున్నారు. సల్మాన్ 'ట్యూబ్ లైట్' సినిమాలో అతిథి పాత్రలో షారూఖ్ కనిపిస్తే... షారూఖ్ కొత్త చిత్రంలోని అతిథి పాత్రతో పాటు పాటలో సల్మాన్ సందడి చేయనున్నాడు.
ఈ నేపథ్యంలో షారూఖ్ మిత్రుడు సల్మాన్ కు బెంజ్ సంస్థ తయారు చేసిన లగ్జరీ కారును బహుమతిగా అందజేశాడు. ఈ కారులో ఇప్పుడు సల్మాన్ షికార్లకు వెళ్తున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో 'షారూఖ్ కారులో సల్మాన్ షికార్లు' అంటూ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. 'బాలీవుడ్ అగ్రహీరోల స్నేహానికి ఇది నిదర్శనం' అంటూ ఈ కారు ఫోటోను వారి అభిమానులు షేర్ చేసుకుంటున్నారు.