: మరణించిన వ్యక్తి బతికి వస్తాడని నాలుగు నెలలుగా శవాన్ని ఇంట్లో పెట్టుకున్న కుటుంబీకులు!
మరణించిన వ్యక్తి చావును జయిస్తాడని, తిరిగి మళ్లీ వస్తాడన్న ఆశతో నాలుగు నెలలపాటు శవాన్ని ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తున్న కుటుంబాన్ని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన వివరాల్లోకి వెళ్తే... కేరళలోని మలప్పురం జిల్లాలో నివసించే సయ్యద్ అనే వ్యక్తి గుండెపోటుతో నాలుగు నెలల క్రితం మృతి చెందాడు. ఆయన మృతి చెందిన నాటి నుంచి ఆయన భార్య, ఇద్దరు పిల్లల ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. దీనిని గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో వచ్చి చూసిన పోలీసులకు దుప్పటి కప్పి ఉన్న మంచం చుట్టూ సయ్యద్ భార్య, ఇద్దరు పిల్లలు ప్రార్థనలు చేస్తూ కనిపించారు. దీంతో మంచం మీద దుప్పటి తొలగించి చూడగా, అక్కడ ఒక అస్థిపంజరం ఉండడం చూసి నిర్ఘాంతపోయారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా....నాలుగు నెలల క్రితమే గుండెపోటుతో సయ్యద్ మృతి చెందాడని, అయితే ప్రార్థనలు చేస్తే ఎప్పుడో ఒకరోజుకి ఆయన బతికి వస్తాడని వారు చెప్పారు. ఆయన మృతి విషయం బంధువులకు కూడా చెప్పలేదని వారు తెలిపారు. దీంతో అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, దానిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు, దర్యాప్తు పూర్తయ్యేవరకు ఇల్లు, ఊరు వదిలి వెళ్లవద్దని సూచించారు.