: తల్లిదండ్రులను, వైద్యులను బెంబేలెత్తిస్తున్న మూడేళ్ల చిన్నారి.. ఏడిస్తే కళ్లవెంట ధారాళంగా రక్తం!
హైదరాబాద్‌కు చెందిన మూడేళ్ల బాలిక తల్లిదండ్రులకు, వైద్యులకు పెద్ద పజిల్‌గా మారింది. విచిత్రమైన ఆమె పరిస్థితి చూసి వైద్యులు సైతం విస్తుబోతున్నారు. ఆమె ఏడ్చినప్పుడు కళ్ల వెంట నీళ్లకు బదులు రక్తం ధారాళంగా కారుతుండడం వారిని కంగారుపెడుతోంది.
16 నెలల క్రితం చిన్నారి అహానా అఫ్జల్ ముక్కు నుంచి రక్తం కారేది. అధిక జ్వరం కారణంగా అలా అయి ఉంటుందని అప్పట్లో వైద్యులు తెలిపారు. కానీ ప్రస్తుతం ఆ చిన్నారి నోరు, చెవులు, కళ్లు, ప్రైవేట్ భాగాల నుంచి కూడా రక్తం క్రమం తప్పకుండా వస్తుండడం ఆందోళనకు గురిచేస్తోంది.
చిన్నారి పరిస్థితిపై పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ.. అహానా ‘హెమాటిడ్రోసిస్’ అనే అరుదైన సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పారు. ఈ సమస్యతో బాధపడుతున్నవారు రక్తాన్ని విసర్జిస్తుంటారని వివరించారు. అహానా విషయంలో ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించడం వలన రక్తం కారడం కొంత వరకు తగ్గినట్టు తెలిపారు. ఆమెకు మరింత మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. చిన్నారి శారీరక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కన్న డాక్టర్ శిరీష ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయలేమని, అయితే చికిత్స మాత్రం కొనసాగుతోందని తెలిపారు.
ఏడాది వయసులోనే అహానా ముక్కు నుంచి రక్తం కారడం మొదలైందని ఆమె తండ్రి మొహమ్మద్ అఫ్జల్ తెలిపారు. ఆ సమయంలో ఆమె న్యుమోనియాతో బాధపడేదని పేర్కొన్నారు. తన కుమార్తె తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటుందా? అన్న ప్రశ్నకు వైద్యులు సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెకు చికిత్స కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందించాలని ఆయన వేడుకున్నారు.