: అసెంబ్లీ పరిసరాల్లోనే మహిళపై లైంగిక వేధింపులు.. ముగ్గురు 'ఆప్' ఎమ్మెల్యేలపై కేసు!
అసెంబ్లీ పరిసరాల్లోనే మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 28న అసెంబ్లీకి హాజరయ్యేందుకు వెళ్లిన 35 ఏళ్ల పార్టీ మహిళా కార్యకర్తపై ఆప్ ఎమ్మెల్యేలు జర్నల్ సింగ్, అమానుతుల్లా ఖాన్, సోమ్‌నాథ్ భారతీలు కలిసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఓ గదిలో ఆమెను బంధించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధిత మహిళ ఆ తర్వాతి రోజు పోలీసులకు వారిపై ఫిర్యాదు చేసింది. తనను తీవ్రంగా కొట్టారని కూడా అందులో పేర్కొంది.
అమానుతుల్లా ఖాన్ తనను నేలపై పడదోసి పట్టుకుంటే జర్నల్ సింగ్ తన పొట్టపై పిడిగుద్దులు కురిపించాడని ఆరోపించింది. దాదాపు అరగంట పాటు వారి వికృత చర్య కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, బాధిత మహిళ ఫిర్యాదుతో తాజాగా ఆ ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లైంగిక వేధింపులు, భౌతిక దాడి, అక్రమ నిర్బంధం తదితర ఆరోపణలపై వారిపై కేసులు నమోదు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిస్తామన్నారు.