: నాకు సూది మందంటే భయం... మా ఇంట్లో వాళ్లకి కూడా తెలియకుండా నెట్టుకొస్తున్నా: నవ్వులు పూయించిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు సంబంధించిన ఒక విషయం చెప్పి సొంత పార్టీ ఎంపీలను నవ్వుల్లో ముంచెత్తారు. కేసీఆర్ కు కంటిలోశుక్లాలు వచ్చాయని, ఆపరేషన్ కోసం ఢిల్లీ వెళ్లారని వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. అయితే రెండు సార్లు ఆపరేషన్ కోసం వెళ్లిన ఆయన రెండు సార్లు వాయిదా వేసుకుని హైదరాబాదు వచ్చారు. తొలుత అమెరికా నుంచి వైద్యుడు సకాలంలో రాలేదని ఆపరేషన్ తప్పించుకున్న ఆయన, రెండో సారి రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాదు వస్తున్నారని, ఆయనకు సంబంధించిన కార్యక్రమాలు చూడాలంటూ తప్పించుకున్నారు. అయితే వాస్తవానికి ఆపరేషన్ ను తప్పించుకునేందుకు అసలు కారణాలు అవి కాదని కేసీఆర్ స్వయంగా పార్టీ ఎంపీలతో చెప్పడం విశేషం.
తనకు సూది మందంటేనే భయమని, వీలైనంత మేరకు మందు బిళ్లలతోనే రోగాలను నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని... సూది మందు వేస్తారని చెప్పడంతోనే తాను ఆపరేషన్ వాయిదా వేసుకుంటూ వస్తున్నానని తెలిపారట. ఈ విషయం తన కుటుంబ సభ్యులకు కూడా తెలియదని, 'ఈ విషయం ఎవరితోనూ చెప్పకండి, చెబితే ఈసారి బలవంతంగా ఆపరేషన్ చేయిస్తార'ని కూడా ఆయన నవ్వుతూ అన్నారట. కేసీఆర్ వ్యాఖ్యలతో ఆశ్చర్యపోయిన ఎంపీలు ‘‘తెలంగాణ తెచ్చిన వీరాధివీరులు మీరు. ఎన్నో రాజకీయ కుట్రలను ఎదుర్కొన్నారు. వేటికీ భయపడని మీరు.. ఒక్క సూది మందుకు భయపడతరా సారూ! చిన్న పిల్లలు కూడా ఈ రోజుల్లో సూదిమందుకు భయపడటం లేదు.. మీరేంది సారూ?’’ అంటూ నవ్వుకున్నారట.