: ఆ వార్తలు అబద్ధం.. ఫడ్నవీస్ కు ఎటువంటి ప్రమాదం జరగలేదు: సీఎంఓ అధికారులు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారంటూ ఈ రోజు మధ్యాహ్నం నుంచి స్థానిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని, అవన్నీ వదంతులేనని.. ఫడ్నవీస్ కు ఎటువంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేసింది. రాయ్‌గఢ్‌లోని అలీబాగ్ ప్రాంతంలో హెలికాప్టర్ ఎక్కేందుకు ఫడ్నవీస్ వెళుతుండగా అది టేకాఫ్ అయిందని, దాని రెక్కలు తగలకుండా ఆయన తృటిలో తప్పించుకున్నారనే వదంతులు ప్రచారమయ్యాయి. ఈ విషయం తెలిసిన సీఎంఓ అధికారులు ఈ వదంతులను ఖండిస్తూ ఓ ప్రకటన చేశారు. కాగా, మే 25న లాతూర్ జిల్లాలోని నిలంగ ప్రాంతంలో ఫడ్నవీస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదుపుతప్పి క్రాష్ ల్యాండ్ అయింది. అయితే, ఆ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు.