: యుద్ధం జరిగితే ఇరు దేశాలకు తీరని నష్టం: చైనా, భారత్ మధ్య ఉద్రిక్తతలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి
సిక్కిం సరిహద్దులో చైనా సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడం, డ్రాగన్ దేశ సైన్యాన్ని భారత్ అడ్డుకుంటుండడంతో భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. భారత్, చైనాల మధ్య యుద్ధం మొదలై.. అణుబాంబుల దాడి చేసేవరకు వెళితే మాత్రం రెండు దేశాలకు తీరని నష్టమేనని అన్నారు. యుద్ధంలో భారత్ మీద చైనా విజయం సాధించడం అంత సులువుకాదని చెప్పారు.
భారత సైన్యం సంఖ్య 1962లో ఎంతో తక్కువని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ దాడిని ఎంతో దీటుగా ఎదుర్కునే స్థితిలో ఉన్నాయని అన్నారు. మనకన్నా చైనాకి ఆయుధాలు, శత్రువులపై దాడిచేసే అత్యాధునిక ఆయుధ సంపత్తి అధికంగానే ఉన్నప్పటికీ, భారత్ ను ఓడించడమంటే అంత తేలికకాదని చెప్పారు. గతానికి, ఇప్పటికి భారత్, చైనా సైనిక శక్తిలో ఎంతో తేడా ఉందని, యుద్ధంలో శత్రువులను ధ్వంసం చేసే శక్తిమంతమైన ఆయుధాల పవర్ ఆనాటికీ ఈనాటికీ వందల రెట్లు పెరిగిందని చెప్పారు. దీంతో యుద్ధం జరిగితే ఇరు దేశాలు కోలుకోలేని దెబ్బ తింటాయని చెప్పారు. ఒకవేళ చైనా యుద్ధానికి రెడీ అంటే మనవాళ్లు ఏ మాత్రం తగ్గకుండా రెడీ అంటూ పోరాడతారని తెలిపారు.