: చైనాది చాలా తీవ్ర‌మైన భాష.. గ‌తంలో వైమానిక దళంలో ఉన్న వ్యక్తిగా చెబుతున్నా: ఉత్త‌మ్ కుమార్ రెడ్డి


భార‌త్‌, చైనాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌న అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. గ‌తంలో ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ పైలట్ గా సేవ‌లందించిన విష‌యం తెలిసిందే. భార‌త ప్ర‌ధాన‌మంత్రి మోదీ అమెరికాకు వెళ్ల‌డంతో కంగారు ప‌డిపోయిన చైనా భార‌త్‌పై బెదిరింపులు చేస్తోంద‌ని ముందు తాను అనుకున్నాన‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. కానీ, ఆ దేశం వివాదాన్ని త‌గ్గించుకోకుండా వ‌రుస‌గా ప‌లు వ్యాఖ్య‌లు చేస్తూ రెచ్చ‌గొడుతుండ‌డం చూస్తుంటే చైనా ఉద్దేశం మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న మాత్ర‌మే కాద‌ని తెలుస్తోంద‌ని అన్నారు. మరోవైపు భూటాన్‌ను చైనా అస్స‌లు లెక్క చేయడం లేదని ఆయ‌న అన్నారు.
 
భార‌త్ తో వివాదం నేప‌థ్యంలో చైనా చాలా తీవ్రమైన భాషను వాడుతోంద‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. చైనా బెదిరింపుల ధోర‌ణికి దిగుతోంద‌ని, గ‌తంలో ఎయిర్ ఫోర్స్ లో ఉన్న వ్యక్తిగా తాను ఈ అభిప్రాయం చెబుతున్నాన‌ని చెప్పారు. చైనా వరుసగా చేసిన వ్యాఖ్య‌లు అల‌జ‌డి రేపేలా ఉన్నాయ‌ని అన్నారు. చైనా తీరుపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యల అనంత‌రం మళ్లీ వెంట‌నే చైనా ప‌లు వ్యాఖ్యలు చేసిందని ఆయ‌న పేర్కొన్నారు. ఇండియా ఇప్పుడు 1962 యుద్ధ స‌మయం నాటి దేశం కాదని అరుణ్ జైట్లీ అంటే, అందుకు ఆ దేశం.. తమ‌ది కూడా అప్ప‌టిలాంటి దేశం కాదంటూ వ్యాఖ్యానించింద‌ని గుర్తు చేశారు. ఇవ‌న్నీ మంచి సంకేతాలు కావని అన్నారు.

  • Loading...

More Telugu News