: జీఎస్టీ ఎఫెక్ట్: కాల్గేట్ ఉత్పత్తులపై తగ్గింపు!
జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేస్తూ హిందూస్తాన్ యునిలివర్ సంస్థ ఇప్పటికే తమ వస్తువుల ధరలను తగ్గించింది. ప్రముఖ సంస్థ ‘కాల్గేట్’ కూడా అదే బాట పట్టింది. ‘కాల్గేట్’ తమ దంత ఉత్పాదనలపై ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ తగ్గింపును ప్రకటించామని పేర్కొంది. కాల్గేట్ టూత్ పేస్టులు, టూత్ బ్రష్ లపై 8 నుంచి 9 శాతం మేర ధరలను తగ్గిస్తున్నామని తెలిపింది. తగ్గింపు ధరలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయని కాల్గేట్-పామోలివ్ భారత్ కు చెందిన అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. కాగా, జీఎస్టీలో టూత్ పేస్ట్ లపై 24 నుంచి 18 శాతానికి పన్ను తగ్గించిన సంగతి తెలిసిందే.