: ఆ నిర్మాతపై రంగు చల్లండి.. లక్ష రూపాయలు పట్టుకెళ్లండి!: కాంగ్రెస్ నేత
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకనిర్మాత మధుర్ భండార్కర్ 'ఇందు సర్కార్' సినిమాను తెరకెక్కించాడు. ఇందిర హయాంలో చోటు చేసుకున్న ఎమర్జెన్సీకి సంబంధించిన అంశంపై ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా పట్ల కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీలతో పాటు మరికొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను చెడుగా చూపించే ప్రయత్నం ఈ సినిమాలో జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. సినిమాను సెన్సార్ చేయడానికి ముందే తమకు ఓ ప్రత్యేక షో వేసి చూపించాలంటూ కాంగ్రెస్ నేతలు సెన్సార్ బోర్డు ఛైర్మన్ కు కూడా ఇప్పటికే లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో, మధుర్ బండార్కర్ పై రంగు పోస్తే లక్ష రూపాయల నగదు బహుమతిని ఇస్తానంటూ యూపీకి చెందిన యువజన కాంగ్రెస్ నేత హసీబ్ అహ్మద్ ప్రకటించారు. ఇందిరాగాంధీని అప్రతిష్టపాలు చేసేందుకే ఈ సినిమాను నిర్మిస్తున్నారని... ఇలాంటి కుట్రలను తాము సహించబోమని హెచ్చరించారు. ఈ సినిమా విడుదల అవుతున్న 28వ తేదీన దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని చెప్పారు. గాంధీ కుటుంబానికి భండార్కర్ క్షమాపణలు చెప్పాలని హసీబ్ డిమాండ్ చేశారు.