: మెరుపు ర్యాలీ... పొలాల్లో దాక్కొని ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చిన వేలాది మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు!
ఈ రోజు ఎమ్మార్పీఎస్ నిర్వహించతలపెట్టిన కురుక్షేత్ర మహాసభకు అనుమతిలేని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే, మహాసభ జరిపి తీరుతామని ప్రకటించిన ఎమ్మార్పీఎస్ అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసుకుంది. గుంటూరు జిల్లాలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఆ జిల్లాలోని చినకాకానిలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మెరుపు ర్యాలీ ప్రారంభించారు. పొలాల్లో దాక్కొని ఒక్కసారిగా వేలాది మంది కార్యకర్తలు బయటకు వచ్చారు. అనంతరం చినకాకానిలో జాతీయ రహదారిపై వారు బైఠాయించారు. మరోవైపు ఎమ్మార్పీఎస్ సభ దృష్ట్యా ఏపీ సచివాలయం వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. అటుగా వెళుతున్న వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు పలు వాహనాల్లో మద్యం సీసాలు గుర్తించారు.