: జహీర్ ఖాన్ సలహాలతోనే రాణిస్తున్నాను: ఉమేష్ యాదవ్
టీమిండియా బౌలర్లలో 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులేసే ఉమేష్ యాదవ్ పేరుతెచ్చుకున్నాడు. అయితే ఒకే లైన్ పై బంతులేయడని, నాలుగు బంతులు బాగా వేసి, రెండు బంతులు చెత్తగా వేసి పరుగులిచ్చేస్తాడనే పేరు కూడా తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్, మహ్మద్ షమీ అంత పేరుతెచ్చుకోలేకపోయాడు. బుమ్రా కూడా యార్కర్లతో రాణించినా ఉమేష్ మాత్రం ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. వేగంపైనే ఎక్కువ దృష్టి పెట్టిన ఉమేష్ నెమ్మదిగా తన బౌలింగ్ లో మార్పు తెచ్చుకున్నాడు. నిలకడగా రాణిస్తూ ఆకట్టుకుంటున్నాడు. వేగంలో మార్పు లేకుండానే పరుగులను కట్టడి చేయడంలో ఆకట్టుకుంటున్నాడు. దీనికి కారణం దిగ్గజ మాజీ బౌలర్ జహీర్ ఖాన్ అని తెలిపాడు.
జహీర్ ఖాన్ తన బౌలింగ్ లో లోపాలను సూచించి, చేసిన తప్పుల నుంచి పాఠం ఎంత వేగంగా నేర్చుకుంటే అంత వేగంగా మారుతావని సూచించాడు. అప్పటి నుంచి ఒంటరిగా కూర్చుని తనలోని లోపాలను ఒకటికి రెండు సార్లు సరి చూసుకోవడం అలవాటైందని, దీంతో జరిగిన మ్యాచ్ లో తాను చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రాక్టీస్ ప్రారంభిస్తానని తెలిపాడు. తన బలహీతనలపై దృష్టి పెట్టడమే కాకుండా, తన బలాన్ని మరింత బలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తానని చెప్పాడు. గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా బంతులు వేస్తున్నానని, బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే ప్రయత్నంలో ఉన్నానని ఉమేష్ యాదవ్ తెలిపాడు.