: నగదు రహిత సేవల రక్షణకు ఆర్బీఐ కొత్త నియమాలు.. 10 అంశాల్లో
ఏటీఎం, క్రెడిట్ కార్డ్, ఆన్‌లైన్ నగదు బదిలీ వంటి నగదు రహిత సేవల రక్షణ కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త నియమాలు విడుదల చేసింది. అనధికార నగదు బదిలీ తప్పిదాల వల్ల నష్టపోతున్న వినియోగదారుల ప్రయోజనం కోసం ఈ నియమాలు రూపొందించారు. నోట్ల రద్దు వల్ల రోజురోజుకీ పెరుగుతున్న నగదు రహిత సేవలతో పాటు వాటికి సంబంధించిన ఫిర్యాదులు కూడా పెరుగుతుండటం వల్ల ఈ నియమాలను ఆర్బీఐ విడుదల చేసింది.
1. అనధికార నగదు బదిలీ విషయాన్ని మూడు రోజుల్లోగా బ్యాంకు వారికి తెలియజేస్తే వినియోగదారుడు ఎలాంటి నష్టం భరించాల్సిన అవసరం ఉండదు.
2. మూడు నుంచి ఏడు రోజుల్లోగా తెలియజేస్తే, అకౌంట్ రకాన్ని బట్టి గరిష్టంగా రూ. 5000 - రూ. 25000ల వరకే వినియోగదారుడు నష్టాన్ని భరించాల్సి ఉంటుంది.
3. ఏడు రోజుల తర్వాత తెలియజేస్తే సంబంధిత బ్యాంకు విధివిధానాల ప్రకారం వారు విధించినంత నష్టాన్ని వినియోగదారుడు భరించాల్సి ఉంటుంది.
4. ఇవన్నీ కాకుండా వినియోగదారుడి నిర్లక్ష్యం వల్ల (పిన్ నంబర్, పాస్‌వర్డ్ అందరికీ చెప్పడం) అనధికార బదిలీ జరిగితే, దానికి సంబంధించిన ఫిర్యాదును (ఏటీఎం పనిచేయకుండా చేయమని అడగడం, వ్యక్తిగత ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను తాత్కాలిక నిలిపివేయమని కోరడం) బ్యాంకుకు తెలియజేసే వరకు ఆ నష్టానికి వినియోగదారుడే బాధ్యత వహించాలి. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కూడా ఏదైనా నష్టం జరిగితే అందుకు బ్యాంకు బాధ్యత వహిస్తుంది.
5. ఈ నియమాలు ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, పాయింట్ ఆఫ్ సేల్స్ సేవలపై వర్తిస్తాయి.
6. అనధికార నగదు బదిలీ విషయంపై వినియోగదారుని బాధ్యతను రుజువు చేయాల్సిన భారం బ్యాంకుదే.
7. అనధికార బదిలీ ఫిర్యాదు నిజమే అని రుజువైతే, ఫిర్యాదు అందిన తేదీ నుంచి పది రోజుల్లోగా బ్యాంకు నష్టపరిహారం చెల్లించాలి.
8. ఇలాంటి ఆన్‌లైన్ తప్పిదాలు జరగకుండా ఉండేందుకు వినియోగదారుని మొబైల్ నంబర్, ఈ-మెయిల్ వివరాలను అకౌంట్‌తో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేయాలి.
9. నగదు సేవలకు సంబంధించిన మెసేజ్‌కు వినియోగదారుడు రిప్లై ఇచ్చే సౌకర్యం కలిగించాలి.
10. అలాగే బ్యాంకు వెబ్‌సైట్‌లో ఫిర్యాదుల కోసం ఒక లింక్ ఏర్పాటు చేయాలి.