: 12,495 సేవా టికెట్లు లక్కీ భక్తులకు: టీటీడీ


అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవెంకటేశ్వరుని సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. మొత్తం 56,295 సేవా టికెట్లను విడుదల చేశామని, వీటిల్లో లక్కీ డిప్ విధానంలో 12,495 ముఖ్యమైన సేవా టికెట్లను అదృష్ట భక్తులకు కేటాయిస్తామని తెలిపింది. సుప్రభాత సేవకు 7,780, అర్చన, తోమాల సేవలకు 120 చొప్పున, అష్టదళ పాద పద్మారాధనకు 300, నిజరూప దర్శనానికి 2,300, విశేషపూజకు 1,875 టికెట్లను ఆన్ లైన్లో ఉంచినట్టు తెలిపింది. ఈ సేవల్లో పాల్గొనాలని భావించే భక్తులు ఆన్ లైన్లో, తమ ఆధార్ సంఖ్యను తెలుపుతూ వచ్చే వారం రోజులూ నమోదు చేసుకోవచ్చని, ఆపై 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు టికెట్లను కేటాయిస్తామని పేర్కొంది.

టికెట్లను పొందిన వారికి ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారాన్ని అందిస్తామని, వారు మూడు రోజుల్లోగా ఎంపికైన సేవకు డబ్బులను చెల్లించాల్సి వుంటుందని వెల్లడించింది. మిగిలిన సేవలైన కల్యాణోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలకు ఆన్ లైన్ నుంచి నేరుగా టికెట్లను కొనుగోలు చేయవచ్చని తెలిపింది. కల్యాణోత్సవానికి 10,500, ఊంజల్ సేవకు 2,800, వసంతోత్సవానికి 11,180, ఆర్జిత బ్రహ్మోత్సవానికి 6,020, సహస్ర దీపాలంకార సేవకు 13,300 టికెట్లను అందుబాటులో ఉంచామని వెల్లడించింది.

  • Loading...

More Telugu News