: కుకునూరుపల్లి తీసుకెళ్లిన పోలీసులు మా అనుమానాలను తీర్చలేదు!: శిరీష కుటుంబ సభ్యులు
హైదరాబాదు ఫిల్మ్ నగర్ లోని ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష కుటుంబ సభ్యులు పోలీసులను కలిశారు. ఈ నేపథ్యంలో వారి అనుమానాలు నివృత్తి చేస్తామని చెప్పిన పోలీసులు, కారులో తమను కుకునూరుపల్లి తీసుకెళ్లారని తెలిపారు. అయితే తమ అనుమానాలు నివృత్తి చేయలేదని, శిరీష షేర్ చేసిన లొకేషన్ ను పోలీసులు చెక్ చేసుకున్నారని వారు చెప్పారు. కనీసం తమను కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లోపలికి కూడా తీసుకెళ్లలేదని వారు తెలిపారు.
పోలీసులు తమకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని, ఏం జరిగిందో, ఎలా జరిగి ఉంటుందన్న విషయాలేవీ తమకు చెప్పలేదని వారు తెలిపారు. ఈ కేసులో పోలీసుల వ్యవహారశైలి మొత్తం అనుమానాస్పదంగా ఉందని వారు తెలిపారు. ఈ కేసులో కేవలం సెక్స్ అన్న అంశం చుట్టూనే పోలీసులు తిరుగుతున్నారని, ఆమెది హత్యా? ఆత్మహత్యా? అన్న విషయాన్ని దర్యాప్తు చేయలేదని చెప్పారు. అలాగే తేజస్వినితో మాట్లాడించారని వారు తెలిపారు. సీన్ టు సీన్ వివరిస్తారని భావించామని, వారు మాత్రం అలా చేయలేదని వారు తెలిపారు.