: సచిన్ పేరిట ఉన్న అరుదైన రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ
వరుసగా ఒక్కో రికార్డునూ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకెళుతున్న భారత జట్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న చేజింగుల్లో అత్యధిక సెంచరీల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఓ వన్డే మ్యాచ్ లో లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అత్యధికంగా 17 సెంచరీలు చేసిన ఘనత ఇప్పటివరకూ సచిన్ పేరు మీదుండగా, నిన్నటి వెస్టిండీస్ మ్యాచ్ తో అది కోహ్లీ చేతికి దక్కింది.
దినేష్ కార్తీక్ మరో ఎండ్ లో తోడుగా నిలువగా, కోహ్లీ 115 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 111 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ ని గెలిపించిన సంగతి తెలిసిందే. ఇక సచిన్ 17 శతకాలు నమోదు కావడానికి 232 ఇన్నింగ్స్ లు ఆడగా, కోహ్లీ 102 ఇన్నింగ్స్ ల్లోనే ఆ ఘనతను చేరుకోవడం గమనార్హం. ఐదు వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ ని వరుణుడు అడ్డుకోగా, ఆపై 2, 3 మ్యాచ్ లను ఇండియా గెలుచుకోగా, నాలుగో మ్యాచ్ ని వెస్టిండీస్ గెలుచుకుంది. నిర్ణయాత్మకమైన ఐదో వన్డేలో విజయంతో వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ను భారత జట్టు 3-1 తేడాతో గెలుచుకుంది. ఇక విండీస్ టూర్ పర్యటనకు ఆఖరుగా ఓ టీ-20 మ్యాచ్ ఈ నెల 9న జరగనుంది.