: పంజాబ్ లో మళ్లీ ఖలిస్థాన్ కలకలం... ఐదుగురిపై రాజద్రోహం కేసు
1984లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖలిస్థాన్ తీవ్రవాద ఉద్యమం మరోసారి పంజాబ్ లో తెరపైకి వచ్చింది. అప్పట్లో ప్రత్యేక ఖలిస్థాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కొందరు సిక్కులు పోరాటం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సమాంతర ప్రభుత్వం నడిపే ప్రయత్నం చేస్తూ, తీవ్రవాద నాయకుడు బింద్రన్ వాలే తిరుగుబాటు చేశాడు. అమృతసర్ లోని అకాలీ తక్త్ కాంప్లెక్స్ లో తన అనుచర తీవ్రవాదులతో తిష్ట వేసి, మారణాయుధాలతో విధ్వంసానికి దిగడంతో రంగంలోకి దిగిన కేంద్రప్రభుత్వం 'ఆపరేషన్ బ్లూస్టార్' పేరిట సైనిక చర్య తీసుకుని, విజయవంతంగా అణచివేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారీ ప్రాణ నష్టం చోటుచేసుకుంది.
అనంతరం ఇందిరాగాంధీని దారుణంగా హతమార్చడం, తరువాత సిక్కు వ్యతిరేక అల్లర్లు సీక్వెల్ గా చోటుచేసుకున్నాయి. మళ్లీ ఇన్నేళ్ల తరువాత పంజాబ్ లో ఖలిస్థాన్ ఏర్పాటు చేయాలంటూ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. దీంతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు, ఐదుగురిపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఇందులో యూఎస్ కు చెందిన ముగ్గురు, భారత్ కు చెందిన వారు ఇద్దరు ఉండడం విశేషం.
న్యూయార్క్ కు చెందిన సిక్స్ ఫర్ జస్టిస్ లీగల్ అడ్వయిజర్ గుర్ పత్ వంత్ సింగ్ పున్నన్, ఎస్‌ఎఫ్‌జే కార్యకర్తలు జగ్ దీప్ సింగ్, జగ్ తీత్ సింగ్, మోహాలీకి చెందిన గురుప్రీత్ సింగ్, జమ్ముకు చెందిన హర్ పూనిత్ సింగ్ లపై రాజద్రోహం, శత్రుత్వం పెంపొందించడం, నేరపూరితమైన కుట్రలకు పాల్పడటం వంటి సెక్షన్లపై కేసులు నమోదు చేశారు.