: మరో వివాదంలో రావెల కిశోర్ బాబు.. 'కురుక్షేత్రం' సభకు ఆహ్వానం పలికిన మాజీ మంత్రి!
మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు మరో వివాదంలో ఇరుక్కున్నారు. గుంటూరులో ఎమ్మార్పీఎస్ నిర్వహించతలపెట్టిన 'కురుక్షేత్రం' సభకు రావెల ఆహ్వానం పలుకుతున్నట్టు గుంటూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇది వివాదాస్పదమైంది. మంద కృష్ణ మాదిగ సభపై అధికారపార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రావెల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పార్టీలో కలకలం రేపుతోంది.
కాగా, రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా ప్రజలను తిట్టిపోసిన మంద కృష్ణ మాదిగ ఇప్పుడు ఏపీలో ఎలా సభపెడతారంటూ పలువురు ఏపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ సభకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయినప్పటికీ సభను నిర్వహించే తీరుతామని ఎమ్మార్పీఎస్ చెబుతోంది. ఈ నేపథ్యంలో రావెల ఫ్లెక్సీలు అధికార పార్టీలో చర్చకు కారణమయ్యాయి. ఇప్పటికే వివాదాస్పద వ్యవహార శైలితో మంత్రి పదవి కోల్పోయిన రావెలకు ఈ వివాదం కొత్త చిక్కులుతెచ్చే అవకాశం కనిపిస్తోంది.