: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కోహ్లీ, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రహానే... విండీస్ సిరీస్ టీమిండియా వశం!
వెస్టిండీస్ పర్యటనను టీమిండియా విజయవంతంగా ముగించింది. కింగ్ స్టన్ వేదికగా జరిగిన చివరి వన్డేలో భారత జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టుకు 10వ ఓవర్ లో హార్డిక్ పాండ్య లూయీస్ (9) ను అవుట్ చేసి షాకిచ్చాడు. అనంతరం మరో ఓపెనర్ కైలే హోప్ (46) వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన షై హోప్ (51)తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. అర్ధసెంచరీ ముంగిట హోప్ ను ఉమేష్ యాదవ్ దొరకబుచ్చుకున్నాడు. అనంతరం మహ్మద్ (16) కేదార్ జాదవ్ ఉచ్చులో పడ్డాడు. జోరుమీదున్న హోల్డర్ (36) ను షమి అవుట్ చేశాడు.
పావెల్ (29) ను ఉమేష్ యాదవ్ పెవిలియన్ కు పంపాడు. అనంతరం నర్స్ ను డకౌట్ చేసిన షమీ, బిషూ (6)ను కూడా అవుట్ చేశాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో వెస్టిండీస్ జట్టు 205 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు అజింక్యా రహానే (39), శిఖర్ ధావన్ (6) వికెట్లు కోల్పోయింది. కోహ్లీ (111) సెంచరీతో రాణించగా అతనికి దినేష్ కార్తీక్ (50) అర్థ సెంచరీతో చక్కని సహకారమందించాడు. దీంతో కేవలం 36.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కోహ్లీ నిలవగా, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా అజింక్యా రహానే నిలిచాడు. సిరీట్ టీమిండియా వశమైంది.