: మూడు బార్లు, ఆరు వైన్స్ గా ఏపీ వర్థిల్లుతోంది: ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యంగ్యాస్త్రాలు
మూడు బార్లు, ఆరు వైన్స్ గా ఏపీ బ్రహ్మాండంగావర్థిల్లుతోందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యంగ్యంగా అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనావాసాల మధ్య మద్యం షాపులకు అనుమతివ్వడం కంటే నీచమైన పని మరోటి లేదంటూ ఆయన మండిపడ్డారు. మంత్రి ఇంటి పక్కనే మద్యం షాపు పెడితే లైసెన్స్ ఇస్తారా? అని ఆయన ప్రశ్నించారు. మద్యంపై ఏపీలో నూతన విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని, డబ్బే కాదు..ప్రజా శ్రేయస్సూ ముఖ్యమనే విషయాన్ని తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. ఏపీలో బీజేపీ ప్రభుత్వం వస్తే మద్యం విక్రయాలు అనేవే ఉండవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రంజాన్ తోఫా, చంద్రన్న సంక్రాంతి కానుకలను నిలిపివేసి, ఆ డబ్బును ఆసుపత్రులకు వినియోగిస్తే పేదోడికి మేలు జరుగుతుందని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.