: మా సంస్థ పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల జాగ్రత్తగా వుండండి!: అభిమానులకు సల్మాన్ సూచన
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కొన్నేళ్లుగా బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తమ సంస్థ పేరు చెప్పుకుని మోసాలకు పాల్పడుతున్నవారిపై సల్మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. తమ సంస్థ పేరు ఉపయోగించుకుని కొందరు తప్పుడు వెబ్ సైట్ల ద్వారా ప్రజల నుంచి డబ్బు వసూలు చేసుకుంటున్నారని, ‘బీయింగ్ హ్యూమన్’ ద్వారా సాయమందిస్తామని కూడా వారికి తప్పుడు మాటలు చెబుతున్నారని సల్మాన్ మండిపడ్డాడు. ఇటువంటి వ్యక్తులను నమ్మవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు.
సల్మాన్ ఖాన్ తరపున, సంస్థ తరపున తాము పనిచేస్తున్నామని చెబుతూ ఈ విధమైన మోసాలకు పాల్పడుతున్నారని, అమిత్ అహుజా, సమీర్, రవి మల్హోత్రా వంటి పేర్లను ఉపయోగించుకుని ఈ తరహా మోసాలు చేస్తున్నారని సల్మాన్ చెప్పాడు. మెడికల్ రిలీఫ్ నిమిత్తం తమ సంస్థ ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ లేదా మెంబర్ షిప్ ఫీజ్ తీసుకోదని, ప్రొఫెషనల్, ఎడ్యుకేషనల్ రుణాలు ఇవ్వదని, ఈ విషయాన్నితన అభిమానులు, ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. తమ సంస్థ పేరు ఉపయోగించుకునే వ్యక్తులకు, వెబ్ సైట్లకు ఎటువంటి విరాళాలు, డబ్బు చెల్లించవద్దని ఈ సందర్భంగా సల్మాన్ కోరారు.