: కోవింద్ కు జగన్ పాదాభివందనం చేస్తే తప్పేంటి?: అంబటి రాంబాబు
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు వైఎస్సార్సీపీ అధినేత జగన్ పాదాభివందనం చేస్తే తప్పేంటని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మన కంటే వయసులో పెద్దవారికి నమస్కరించడం మన సంప్రదాయమని, కోవింద్ కు జగన్ పాదాభివందనం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుగా చిత్రీకరించడం సబబు కాదని అన్నారు. తాము మద్దతు ఇస్తోంది ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కే తప్పా, బీజేపీకి కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, హెరిటేజ్ వాహనంలో తరలించిన ఎర్రచందనం దుంగల విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై మంత్రులు ఆదినారాయణరెడ్డి, అమరనాథ్ రెడ్డి చాలా నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. ఆ వాహనాన్ని పట్టుకుంది తమ పార్టీ కార్యకర్తలు కాదని, టాస్క్ ఫోర్స్ పోలీసులేనన్న విషయాన్ని టీడీపీ నేతలు గ్రహించాలని అన్నారు.