: సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకే కేసీఆర్ ఇలా చేస్తున్నారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్


తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ నేతల కాళ్ల వద్ద తాకట్టు పెట్టవద్దని... ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేతులు జోడించి అడుగుతున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. తెలంగాణ బిల్లును పాస్ చేసే సమయంలో అప్పటి లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ చేసిన కృషిని మర్చిపోరాదని... ఆమె చేసిన పనికి కృతజ్ఞతగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమెకు మద్దతివ్వాలని అన్నారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకే కేసీఆర్ బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి నీతి, నిజాయతీ లేవనే విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైందని... ఇప్పుడు మీరాకుమార్ కు మద్దతు ఇవ్వకపోతే, అదే విషయం మరోసారి రుజువవుతుందని చెప్పారు.

మీరాకుమార్ కు మద్దతు ఇవ్వాలంటూ తాము అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను కలుస్తున్నామని... ఇప్పటికే 38 మంది ఆమెకు ఓటు వేసేందుకు రెడీగా ఉన్నారని సంపత్ తెలిపారు. వీరిలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే అధికంగా ఉన్నారని చెప్పారు. ఓటింగ్ జరిగే సమయంలో 90 శాతం మంది తమ ఆత్మప్రబోధానుసారమే ఓటు వేస్తారని చెప్పారు. 

  • Loading...

More Telugu News