: మంద కృష్ణ మాదిగకు ఏపీలో మాట్లాడే అర్హత లేదు: వర్ల రామయ్య మండిపాటు
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగపై ఏపీ టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఏపీ రాజధాని అమరావతిలో ‘కురుక్షేత్ర సంగ్రామం’ పేరిట సభ పెడుతున్నామని చెప్పి ఊరూరా తిరిగి మంద కృష్ణ మాదిగ ప్రచారం చేస్తున్నారు. అసలు, ఈ సభ ఎందుకు పెడుతున్నారని నేను అడుగుతున్నాను. నాడు సమైక్య ఉద్యమం అర్థరహితమన్న మీరు.. నేడు మా రాష్ట్రంలోకి వచ్చి ఇటువంటి సభలు ఎందుకు పెడుతున్నారు? ఇటువంటి సభలు పెట్టే నైతిక హక్కు మంద కృష్ణ మాదిగకు ఎక్కడ ఉంది? అసలు ఏపీలో ఎటువంటి సమావేశం నిర్వహించే హక్కు మీకు లేదు. రాజకీయ అనిశ్చితి కల్పించడం కోసం, అమరావతి నడిబొడ్డున కురుక్షేత్ర మహాసభను మంద కృష్ణతో ఎవరు పెట్టిస్తున్నారు? ఈ మహాసభ వెనుక ఎవరున్నారో సమాధానం చెప్పగలరా? అందుకే, మంద కృష్ణకు ఏపీలో మాట్లాడే అర్హత లేదు’ అని మండిపడ్డారు.