: నకిలీ కులధ్రువీకరణ పత్రాలతో పొందిన ఉద్యోగాలు, ప్రవేశాలు చెల్లవు: సుప్రీంకోర్టు
నకిలీ కులధ్రువీకరణ పత్రాలు చూపించి రిజర్వేషన్ కోటా ద్వారా పొందిన ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాలయ ప్రవేశాలు చెల్లవని భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అలా చేయడం చట్టం దృష్టిలో నేరమని తెలిపింది. ఉద్యోగి తప్పుడు కుల పత్రాలు సమర్పించినట్లు 20 ఏళ్ల తర్వాత బయటపడినా అతన్ని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించి, శిక్ష విధించవచ్చని వివరించింది. గతంలో ఇదే విషయంపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విభిన్నంగా జేఎస్ ఖేహర్, డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం తీర్పునిచ్చింది. బాంబే హైకోర్టు తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది. అయితే ఇక ముందు జరగనున్న నియామకాలపై మాత్రమే ఈ తీర్పు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.