: విద్యాసంస్థల్లో డ్రగ్స్ సరఫరాపై మీడియా సంయమనం పాటించాలి: కడియం శ్రీహరి హితవు
హైదరాబాద్‌లోని పలు స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ వ్యవహారం బయటపడడంతో దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అవుతోంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి చర్యలపై తాము కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్ సరఫరా జరిగినట్లు తేలితే వాటి గుర్తింపును రద్దు చేస్తామని తెలిపారు. అలాగే క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనలను గమనించి, తగిన విధంగా స్పందించాలని ఆయన సూచించారు.
విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల సరఫరాపై మీడియా మాత్రం కాస్త సంయమనం పాటించాలని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. డ్రగ్స్ విషయం ఎంతో సున్నితమైన విషయమని అన్నారు. ఒకరిద్దరు చేసే తప్పుడు పనికి ఎంతో మంది తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతారన్న విషయాన్ని మీడియా గుర్తించాలని హితవు పలికారు.