: ప్రతి ఇంటికీ మద్యం, బిర్యానీ సరఫరా అవుతున్నాయి: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు


తెలుగుదేశం ప్రభుత్వంపై బీజేపీ ఏపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా మద్యపానాన్ని నిషేధించాలనేది మహాత్మాగాంధీ కోరిక అని... గాంధీ కలలకు టీడీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మద్యం, బిర్యానీ సరఫరా అవుతున్నాయని అన్నారు. మద్యానికి వ్యతిరేకంగా మహిళలు ఆందోళనకు దిగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అబ్కారీ శాఖలో అంతులేని అవినీతి జరుగుతోందని... దీన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని అన్నారు. మద్యం పేరుతో జనాలను దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. అబ్కారీ శాఖలో జరుగుతున్న అవినీతిపై ముఖ్యమంత్రికి లేఖ రాశానని చెప్పారు. మద్యంపై వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకోవడం దారుణమని అన్నారు. ఇప్పటి వరకు రూ. 330 కోట్లతో మొక్కలను నాటారని... మూడు రోజులకే మొక్కలు చచ్చిపోయాయని మండిపడ్డారు.

మద్యం, పెట్రోల్ ను కొన్ని దేశాలు జీఎస్టీ నుంచి మినహాయించాయని...  అందుకే మనం కూడా మినహాయించామని సోము వీర్రాజు తెలిపారు. రాజకీయ పార్టీల విరాళాల ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ పర్యటనను కొందరు రాజకీయం చేసేందుకు యత్నిస్తున్నారని.. పాదాభివందనం పేరుతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. పెద్దలకు పాదాభివందం చేయడమనేది మన సంస్కృతిలో ఒక భాగమని... దీన్ని కూడా రాజకీయం చేయడం మంచిది కాదని చెప్పారు.

  • Loading...

More Telugu News