: మోదీని కలవడం జరగదు... అందుకు పరిస్థితులు సహకరించడం లేదు : చైనా
హాంబర్గ్‌లో జరగనున్న జీ20 సమావేశాల వద్ద భారత ప్రధాని నరేంద్రమోదీని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కలవడం జరగదని, అందుకు ప్రస్తుత పరిస్థితులు సహకరించడం లేదని చైనా తెగేసి చెప్పింది. ఇరు దేశాల ఆర్మీల మధ్య సిక్కిం ప్రాంతంలో కొనసాగుతున్న వివాదమే ఇందుకు ప్రధాన కారణం. ఇజ్రాయెల్ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ ఇవాళ రాత్రి హాంబర్గ్ చేరుకోనున్నారు. జీ20 సమావేశాల సమయంలో ద్వైపాక్షిక చర్చల కోసం సంబంధిత దేశాలు విడిగా సమావేశమవుతుంటాయి. ఈ క్రమంలో చైనా, భారత్‌ల మధ్య జీ20 వేదికగా ద్వైపాక్షిక సంబంధాలకు ఇది సరైన సమయం కాదని చైనా అభిప్రాయం. సిక్కిం సరిహద్దు వివాదంలో చైనా ఆర్మీ రోజుకో రూపంలో హెచ్చరిక జారీచేసుకుంటూ వెళ్తున్న సంగతి తెలిసిందే.