: 'సూపర్ 30'తో కలిసి 'రహమాన్ 30': సౌదీ ఎన్నారై ముందడుగు
ఆర్థికంగా వెనుకబడిన 30 మంది ప్రతిభగల విద్యార్థులకు ప్రతిష్టాత్మక ఐఐటీ పరీక్షలో విజయం సాధించేందుకు ఉచిత శిక్షణ అందించే 'సూపర్ 30' కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకున్నాడో సౌదీ ఎన్నారై. అతని పేరు ఒబైదూర్ రహమాన్. భారత సంతతికి చెందిన రహమాన్‌కు సౌదీ అరేబియాలో బిజినెస్‌లు ఉన్నాయి. `బిహార్ ఫౌండేషన్ ఇన్ సౌదీ`కి చైర్మన్‌గా కూడా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు, ఉద్యోగ సాధనకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు `రహమాన్ 30` కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దీనిని 'సూపర్ 30' నిర్వాహకులతో కలిసి చేబడుతున్నట్టు రహమాన్ తెలిపారు. `ఆర్థికంగా బలంగా లేకపోవడం వల్ల ప్రతిభ గల విద్యార్థులు నాణ్యత గల విద్యను, ఉద్యోగ నైపుణ్యాలను పొందలేకపోతున్నారు. వీరిని ముందుకు నడిపించడమే రహమాన్ 30 ముఖ్య లక్ష్యం` అని రహమాన్ అన్నారు. పేద కుటుంబంలో పుట్టి సూపర్ 30 ద్వారా ఐఐటీలో సీటు సాధించిన అర్బాజ్ ఆలం లాంటి విద్యార్థులను చూసినపుడు తనకు ఈ ఆలోచన వచ్చిందని రహమాన్ తెలిపారు. పాట్నా కేంద్రంగా పనిచేసే సూపర్ 30ని ఆనంద్ కుమార్ నెలకొల్పారు. దీని ద్వారా ఇప్పటికే 400 మందికి పైగా విద్యార్థులు ఐఐటీల్లో సీటు సంపాదించారు.