: సామరస్యతే కావాలనుకుంటే బేషరతుగా వెనక్కు పొండి!: హెచ్చరిస్తూ వీడియో విడుదల చేసిన చైనా


ఇప్పటికే పలు మార్లు భారత్ ను హెచ్చరించిన చైనా, మరోసారి నోరు పారేసుకుంది. ఈసారి ఓ వీడియోను విడుదల చేస్తూ, సిక్కిం సరిహద్దుల నుంచి తక్షణం బేషరతుగా భారత సైన్యం వెనక్కు తగ్గాలని, అప్పుడే ఇరు దేశాల మధ్యా చర్చలకు అవకాశం ఉంటుందని హెచ్చరించింది. లేకుంటే జరిగే పరిణామాలకు భారత్ దే బాధ్యతని చెప్పింది. న్యూఢిల్లీలోని చైనా ఎంబసీలో పొలిటికల్ కౌన్సిలర్ గా ఉన్న లీ యా ఈ వ్యాఖ్యలు చేయగా, ఆ వీడియోను ఎంబసీ విడుదల చేసింది. గతంలో చేసుకున్న ఒప్పందాలను భారత్ గౌరవించాలని, వెంటనే సరిహద్దుల నుంచి సైన్యాన్ని వెనక్కు తెప్పించాలని, అప్పుడే చర్చలు సాధ్యమని ఈ వీడియోలో లీ వ్యాఖ్యానించారు.

ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించాలనే ప్రయత్నిస్తున్నామని, అది జరగాలంటే, సైన్యం మాత్రం అక్కడ ఉండకూడదని ఆయన అన్నారు. డోక్లాం ప్రాంతం తమదేనని చెప్పడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని, అది తమ సంప్రదాయంతో మిళితమైన ప్రాంతమని, ఇక్కడి ప్రజలు తమ దేశానికే పన్నులు చెల్లిస్తున్నారని, ప్రజల రక్షణ బాధ్యతలనూ తామే నిర్వహిస్తున్నామని లీ తెలిపారు. చైనా భూభాగంలోకి జూన్ 18న భారత దళాలు ప్రవేశించాయని, అప్పటి వరకూ లేని అలజడి ఆ రోజు నుంచే మొదలైందని ఆయన ఆరోపించారు. టిబెట్, సిక్కిం ప్రాంతాలపై 1890లోనే అప్పటి బ్రిటన్ తో తాము ఒప్పందం చేసుకున్నామని ఈ సందర్భంగా లీ గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News