: శబరిమల అయ్యప్ప హుండీలో తొలిసారిగా పాకిస్థాన్ కరెన్సీ
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కిస్తున్న వేళ, హుండీలో పాకిస్థాన్ కరెన్సీ కనిపించింది. ఇటీవలి ప్రత్యేక పూజలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. తాజాగా, హుండీలోని డబ్బును లెక్కిస్తుండగా, పాక్ కు చెందిన 20 రూపాయల నోటు కనిపించింది. వాస్తవానికి దేవాలయాల హుండీల్లోకి విదేశీ కరెన్సీ రావడం సర్వ సాధారణమే. అయ్యప్ప హుండీల్లోనూ పలు దేశాల కరెన్సీ కాగితాలు కానుకలుగా వస్తుంటాయి.
అయితే, అయ్యప్ప హుండీలో ఇలా పాక్ కరెన్సీ కనిపించడం మాత్రం ఇదే తొలిసారని ఆలయ అధికారులు తెలిపారు. పాక్ కరెన్సీ హుండీలో కనిపించడాన్ని తేలికగా తీసుకోవడం లేదని, ఇంటెలిజెన్స్ బ్యూరోకు సమాచారం తెలిపామని పథనంతిట్ట ఎస్పీ సతీష్ మీడియాకు తెలిపారు. ఈ నోటును ఎవరు వేసి వుంటారన్న విషయాన్ని తేల్చేందుకు సీసీటీవీ ఫుటేజ్ లను నిశితంగా పరిశీలించామని, అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని అన్నారు.