: మూడో కంటికి తెలియకుండా 8 ఏళ్లు ఇంట్లో భార్య మృతదేహం!
మూడో కంటికి తెలియకుండా ఒక వ్యక్తి తన భార్య శవాన్ని ఎనిమిదేళ్ల పాటు దాచి ప్రపంచాన్ని ఏమార్చిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.... ఫ్లోరిడాలో అలెన్ డన్స్ అనే వ్యక్తి భార్య మార్గరెట్ డన్ 2002లో మరణించింది. అయితే, ప్రభుత్వం ఉచితంగా అందించే పథకాల ద్వారా వచ్చే లబ్ధిని కోల్పోకుండా ఉండేందుకు ఆమె మృతి చెందిన విషయాన్ని బాహ్యప్రపంచానికి తెలియనివ్వలేదు. కనీసం సంతానానికి కూడా ఆమె మృతి చెందిందన్న సంగతిని చెప్పలేదు. అంతే కాకుండా తన భార్య బతికే ఉందని చెబుతూ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేవాడు.
ఇలా 2010 వరకు పలు జాగ్రత్తలు తీసుకున్న ఆయన ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయల వరకు ప్రయోజనం పొందాడు. అయితే 2010లో ఆయన కూడా మృతి చెందాడు. దీంతో అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన మృతి చెందాడన్న విషయంతో పాటు, ఆయన భార్య కూడా మృతి చెందిందన్న విషయం, ఆమె మృతదేహాన్ని దాచి ఉంచిన విషయం వెలుగు చూశాయి. దీంతో విచారించిన అధికారులు ఆయన ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకే భార్య మృతి విషయాన్ని దాచాడని నిర్ధారించి, అతని నివాసాన్ని వేలం వేసి, ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని తెలిపారు.