: టాటా ఫైనాన్స్ మాజీ ఎండీ ఆత్మహత్య... మూడేళ్లలో ముగ్గురు!
టాటా ఫైనాన్స్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ పెండ్సే (61) ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తూర్పు దాదర్ ప్రాంతంలో ఉన్న రాయల్ గ్రీస్ బిల్డింగ్ లోని తన ప్రైవేటు కార్యాలయంలోని గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆయన మరణించినట్టు పోలీసులు గుర్తించారు. పెండ్సే మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
కాగా, దిలీప్ టాటా ఫైనాన్స్ సంస్థలో అక్రమాలకు పాల్పడి రూ. 2 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారన్న వార్తలు రావడంతో, అతన్ని సంస్థ డిస్మిస్ చేసింది. ఇక గతంలో టాటా మోటార్స్ లో ఉన్నతోద్యోగులుగా పని చేసి ఆపై అనుమానాస్పద స్థితిలో మరణించిన వారి సంఖ్య పెండ్సేతో కలిపి మూడుకి చేరింది. 2013లో టాటా స్టీల్ మాజీ అధికార ప్రతినిధి చారు దేశ్ పాండే, 2014లో టాటా మోటార్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కార్ల్ స్లిమ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.