: వేగంగా వస్తున్న రైలు ముందుకి దూకి మాయమై.... తిరిగి స్టేషన్లో ప్రత్యక్షం!
రైలు పట్టాల మీద నుంచి దాటవద్దని రైల్వే అధికారులు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా ఎవరూ పట్టించుకోరు. ముందు వెనక చూసుకోకుండా దాటేస్తుంటారు. అదే కొన్ని సార్లు ప్రాణాలను బలిగొంటుంది. పట్టాలు దాటుతూ మృత్యువాత పడ్డవారి సంఖ్య చాలానే ఉంది. కానీ ఈ మహిళ మృత్యువును జయించింది. వేగంగా వస్తున్న రైలు ముందుకి దూకి మాయమై, మరికొద్దిసేపటి తర్వాత స్టేషన్లో ప్రత్యక్షమైంది.
రైలు ముందుకి దూకిన ఆమె, రైలు వెళ్లిపోయిన తర్వాత కనిపించకపోయేసరికి అక్కడి ప్రయాణికులంతా కంగుతిన్నారు. జూన్ 23న ముంబైలోని ఘట్కోపర్ స్టేషన్లో జరిగిన ఈ సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరా రికార్డుల ఆధారంగా రైలు ముందుకి దూకిన మహిళ, పట్టాలకు సమాంతరంగా కింద పడటంతో ప్రమాదమేమీ జరగలేదని, తర్వాత రైలు ఆగినపుడు ఆమె చక్రాల మధ్య నుంచి బయటికి వచ్చి పక్క ప్లాట్ఫాం మీదకి వెళ్లి ఉండవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా కొన్ని సార్లు మృత్యువును జయించాలంటే కాసింత అదృష్టం కూడా ఉండాలి.