: ఉత్తరకొరియాతో అంటకాగుతారెందుకు?: రష్యా, చైనాలపై నిక్కీ హేలీ నిప్పులు
తన దుందుడుకుతనంతో ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తున్న ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ తో రష్యా, చైనాలు అంటకాగుతున్నాయని, కిమ్ చెయ్యి పట్టుకుని నడవటం ఎందుకని యూఎస్ దౌత్య ప్రతినిధి నిక్కీ హేలీ నిప్పులు చెరిగారు. తాజా క్షిపణి పరీక్షల నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్ లో జరిగిన సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆమె, ఉత్తర కొరియా పక్కనే ఉన్న దేశాలుగా, చైనా, రష్యాలు కిమ్ ను నిలువరించాల్సింది పోయి, మద్దతిస్తున్నాయని ఆరోపించారు.
కొరియాకు ఈ దేశాలు ఆర్థిక, సైనిక సాయాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అమెరికా సైనిక సామర్థ్యం అత్యంత శక్తిమంతమైనదని, అయితే, దాని అవసరం వస్తేనే వాడుతామని నిక్కీ వ్యాఖ్యానించారు. సాధ్యమైనంత వరకూ సైనిక చర్యలకు దిగరాదన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. సైన్యాన్ని ప్రయోగించక తప్పదని భావిస్తేనే ముందడుగు వేస్తామన్నారు. ఉత్తర కొరియాకు చైనా, రష్యాలు అందిస్తున్న అన్ని రకాల సాయాన్ని ఆపాలని ఆమె కోరారు.