: క్యూబన్లకు బంపరాఫర్ ప్రకటించిన ప్రభుత్వం.. తెరపైకి పురాతన సంప్రదాయం.. 'ప్రేమ' కోసం గంటల చొప్పున అద్దెకు గదులు!
పురాతన కాలం నాటి క్యూబన్ కల్చర్‌ను తిరిగి తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 20వ శతాబ్దంలో అత్యంత పాప్యులర్ అయిన ‘లవ్ మోటల్స్’ (పాసడోస్)ను తిరిగి ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రజలను రోజువారి ఒత్తిడి నుంచి బయటపడేసేందుకు అతి త్వరలోనే ఈ హోటల్స్ (మోటల్స్)ను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ సంస్థ అయిన హవానాలోని ప్రావిన్షియల్ హౌసింగ్ కంపెనీకి చెందిన అల్ఫోన్సా మునౌజ్ చాంగ్ తెలిపారు. ఈ హోటల్లోని గదుల్లో ప్రేమికులు కానీ, మరెవరైనా కానీ గంటల చొప్పున అద్దె చెల్లించి గడపవచ్చు. నిరభ్యంతరంగా శృంగారంలో పాల్గొనొచ్చు.
1973 ప్రాంతంలో హవానాలో ఇటువంటి ‘పాసాడోస్’ 60 వరకు ఉండేవి. వీటి ముందు ఎప్పుడు చూసినా క్యూలు కనిపించేవి. అయితే 1980 చివరి నాటికి చాలా వరకు పాసడోస్ కనుమరుగయ్యాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రజలు వాటివైపు రావడం తగ్గించడంతో క్రమంగా ఆదరణ కోల్పోయాయి. వాటి నిర్వహణ ఖర్చు పెరిగిపోవడంతో ప్రభుత్వం వాటిని ఇళ్లుగా మార్చేసింది. ఇప్పుడు మళ్లీ వాటిని తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందులో భాగంగా ‘హోటల్ వెంటో’ పేరుతో రెండంతస్తుల భవనాన్ని సిద్ధం చేస్తున్నట్టు మునోజ్ చాంగ్ తెలిపారు. ఇందులో 16 గదులు ఉంటాయని పేర్కొన్న ఆయన, సమీప భవిష్యత్తులో ఈ రంగాన్ని మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు. ఇళ్ల కొరత వల్ల ప్రేమికులు తమ భౌతిక ప్రేమను వ్యక్తం చేసేందుకు ఎక్కువగా బీచ్‌లు, పార్క్‌లు, చీకటి ప్రదేశాలు తదితర వాటిని ఎంచుకుంటుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో ‘లవ్’ బాగా ఖరీదైన వ్యవహారమే. పాసడోస్‌లో గడపాలంటే మూడు గంటలకు 5 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది క్యూబన్ల నెల వేతనం (29.60 డాలర్లు)లో ఆరో వంతు.