: అంబులెన్స్ కు డబ్బుల్లేక.. మృతదేహాన్ని కాలినడకన 5 కిలోమీటర్లు మోసుకెళ్లిన వైనం!
మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు డబ్బుల్లేక, ఓ కర్రకు దుప్పటి కట్టి అందులో ఆ మృతదేహాన్ని వుంచి, 5 కిలోమీటర్ల దూరం కాలినడకన మోసుకెళ్లిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని సురడా నియోజకవర్గ పరిధి సోరిస్ బిలి గ్రామానికి చెందిన భానుమతి నాయక్ (70) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మృతి చెందింది.
దీంతో మృతదేహాన్ని తరలించేందుకు 108 అందుబాటులో లేకపోవడం, ప్రైవేటు అంబులెన్స్ లో తరలించేందుకు సరిపడా డబ్బులు లేకపోవడంతో పెద్ద కర్రకు దుప్పటి కట్టి, దానిలో ఆమె మృతదేహాన్ని పెట్టి 5 కిలోమీటర్ల దూరంలోని ఊరికి కాలినడకన మోసుకెళ్లారు. ఈ ఉదంతం వెలుగు చూడడంతో దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం సొంత జిల్లా కావడంతో నేరుగా ఆయనపై విమర్శలతో దాడి చేస్తున్నాయి. కాగా, కొంత కాలం క్రితం ధనమజ్జి అనే వ్యక్తి డబ్బుల్లేక భార్య మృతదేహాన్ని భుజంపై మోసుకెళ్లిన ఘటన పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే.