: స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ ను అప్పట్లో ఎంత మొత్తానికి టేకోవర్ చేశారో తెలిస్తే షాకే!
భారత్ లో వివిధ నగరాల మధ్య సేవలందించే ఏవియేషన్ సంస్థ స్పైస్ జెట్ కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి పారిశ్రామిక వర్గాల్లో పెను కలకలం రేపుతోంది. ఎందుకంటే సెబీలో లిస్టెడ్ కంపెనీ అయిన స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ ను ఆ కంపెనీ ఒకప్పటి వ్యవస్థాపకుడు, ప్రస్తుత చైర్మన్ అజయ్ సింగ్ కేవలం రెండు రూపాయలకు చేజిక్కించుకున్నారన్న వార్త అందర్నీ షాక్ కు గురి చేస్తోంది. స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ సంస్థ 2014 డిసెంబర్ లో నిధుల కటకటతో మూసివేత అంచున నిలబడింది. బాకీలు కట్టలేక చేతులెత్తేసింది. 2014–15లో కంపెనీ నష్టం 687 కోట్ల రూపాయలు అని ప్రకటించారు. అదే ఏడాది నికర విలువ కూడా తుడిచిపెట్టుకుపోయి మైనస్ 1,329 కోట్ల రూపాయలుగా వుంది. అప్పటికి ఈ సంస్థ మొత్తం రుణభారం విలువ 1,418 కోట్ల రూపాయలుగా తేలింది. అంతే కాకుండా స్వల్పకాలిక వ్యవధి కోసం తీసుకున్న రుణ భారం 2,000 కోట్లు అయింది.
దీంతో స్పైస్ జెట్ ను వదిలించుకోవడమే మేలని అప్పటి యాజమాన్యం అయిన మారన్ కుటుంబం భావించింది. దీంతో కంపెనీని గట్టెక్కించే వ్యూహాత్మక ఇన్వెస్టర్ కోసం గాలించింది. తీవ్ర నష్టాల్లో ఉన్న స్పైస్ జెట్ ను దక్కించుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో అజయ్ సింగ్ ముందుకు వచ్చారు. కేవలం 2 రూపాయలు చెల్లించి కంపెనీని టేకోవర్ చేశారు. సెబీ నిబంధనల ప్రకారం ఏదైనా సంస్థను టేకోవర్ చేసి, యాజమాన్య హక్కులు దక్కించుకునేవారు కచ్చితంగా మిగతా పబ్లిక్ షేర్ హోల్డర్లకు వైదొలిగే వెసులుబాటు కల్పిస్తూ ఓపెన్ ఆఫర్ ఇవ్వాలి. కానీ స్పైస్ జెట్ కేసులో అలా జరగలేదు. అంతే కాకుండా, ఎయిర్ క్రాఫ్ట్ చట్టం 1937 కింద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ 26% ఓపెన్ ఆఫర్ నుంచి అజయ్ సింగ్ కు అసాధారణంగా మినహాయింపునిచ్చింది. దీంతో కేవలం 14 రోజుల్లోనే యాజమాన్య బదలాయింపు కార్యక్రమం మొత్తం పూర్తయింది.
అయితే కేవలం 2 రూపాయలకే స్పైస్ జెట్ ను ప్రమోటర్ విక్రయించేశారంటే దానికి విలువ లేనట్టే అర్థం. అలాంటి పరిస్థితుల్లో అంతవరకు ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు కూడా తమ షేర్లను అమ్ముకుని బయటపడేందుకు ప్రయత్నిస్తారు. అలా జరిగిన మరుక్షణం షేరు ధర కుప్పకూలేది. అలా జరిగితే కంపెనీ కోలుకునే అవకాశాలు ఎంత మాత్రమూ ఉండేవి కాదు. అయితే డీల్ విలువ ఎంత అనేది గోప్యంగా ఉండడంతో షేర్ ధర కుప్పకూలలేదు సరికదా... అజయ్ సింగ్ చేతుల్లోకి కంపెనీ వెళ్తుందన్న విషయం తెలిసిన తరువాత స్పైస్ జెట్ షేర్ ధర పెరుగుతూ వచ్చింది. దీంతో స్పైస్ జెట్ నష్టాల ఊబి నుంచి నెమ్మదిగా బయటపడి రెండేళ్ల వ్యవధిలో లాభాల బాటపట్టింది.
మారన్ ల కుటుంబం చేతుల్లో స్పైస్ జెట్ ఉన్నప్పుడు షేర్ ధర 21.8 రూపాయలుగా ఉండేది. దీంతో వారి వాటా 58.46% షేర్ల ధర రూ.765 కోట్ల రూపాయలు. ప్రస్తుతం స్పైస్ జెట్ షేరు ధర 125 రూపాయలు. దీంతో ఆ మొత్తం వాటాని టేకోవర్ చేసిన అజయ్ సింగ్ వాటాల విలువ ప్రస్తుతం సుమారు 4,400 కోట్ల రూపాయలంటే ఆశ్చర్యం కలుగక మానదు. స్పైస్ జెట్ లాభాల బాట పట్టిన నేపథ్యంలో డీల్ నిబంధనలను సింగ్ గౌరవించడం లేదంటూ మారన్ న్యాయపోరాటం సాగిస్తున్నారు. దీంతో స్పైస్ జెట్ టేకోవర్ కేవలం 2 రూపాయలకే జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చిందని బ్లూమ్ బర్గ్ వెల్లడించింది.